SRSP Water Level Today : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి 62 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఫలితంగా అధికారులు 18 గేట్ల ద్వారా 61 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 75.14 టీఎంసీల సామర్థ్యంతో నీరు నిల్వ ఉంది.
ఎస్కేప్ గేట్ల ద్వారా 2,500 క్యూసెక్కులు.. కాకతీయ కాలువ ద్వారా 3,500 క్యూసెక్కులు.. వరద కాలువ ద్వారా 5,000 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1,087 అడుగులకు చేరింది.
మంజీరా నదికి వరద..: మరోవైపు గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టూ నిండుకుండలా మారింది. సాగర్ గేట్లు ఎత్తడంతో మంజీరా నదికి వరద ప్రవాహం పెరిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర శివారులోని మంజీరా నదిలో లో లెవల్ వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తుంది. దీంతో తెలంగాణ-మహారాష్ట్రల మధ్య రాకపోకలు స్తంభించి.. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.