వాణిజ్య పన్నుల శాఖలో చోటు చేసుకున్న రూ. 300 కోట్ల బోధన్ కుంభకోణంపై సరైన విచారణ జరగలేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం. పద్మనాభ రెడ్డి... గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌కు లేఖ రాసిన ఆయన... కుంభకోణంపై విచారణకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ తాలుకాలో ఓ ట్యాక్స్ కన్సల్టెంట్, కొందరు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, వ్యాపారస్థులు కలిసి నేరపూరిత పథకం రచించి ప్రభుత్వానికి రావాల్సిన పన్నులను జేబులో వేసుకున్నారని తెలిపారు. నకిలీ చలాన్లను సృష్టించి ప్రభుత్వ ఖజానాలో జమ చేసినట్లు చూపించారని పేర్కొన్నారు. 2005లో మొదలైన ఈ కుంభకోణంలో దాదాపు రూ.300 కోట్ల ప్రభుత్వ సొమ్ము స్వాహా చేశారని తెలిపారు.
ఈ వ్యవహారంపై విచారణ నిర్వహించిన ఆ శాఖ నిఘా విభాగం అధికారులు.. 2017 ఫిబ్రవరి 2న బోధన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. తదుపరి చర్యల కోసం తరువాత కేసును సీఐడీకి బదిలీ చేశారు. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు చలానాల్లో భాగస్వాములైన వ్యాపారస్థుల నుంచి తిరిగి రాబట్టే ప్రయత్నాలు చేశారు. దాదాపు రూ. 50 కోట్లు రికవరీ చేసిన తరువాత ఆ ప్రయత్నాన్ని నిలిపివేశారు. వ్యాపారస్థులు రాజకీయ ఒత్తిడి తెచ్చి రూ. 300 కోట్ల కుంభకోణంలో తదుపరి చర్యలు లేకుండా నిలిపివేయించినట్లు పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయని గవర్నర్ దృష్టికి తెచ్చారు.
రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే కేసు విచారణ ముందుకు సాగడం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ భావిస్తోందన్నారు. ఈ కేసును త్వరితగతిన విచారణ చేయించి... దోషులను శిక్షించాలని, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని రాబట్టడానికి చర్యలు తీసుకునేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: విద్యుత్ బిల్లులపై సీఎం కేసీఆర్కు జీవన్రెడ్డి లేఖ