గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలను తప్పక అమలు చేయాల్సిందేనని జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో చేపట్టే ఎన్ఆర్ఈజీఎస్ పనులు పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలోనే జరగాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని రాహుల్‌గాంధీ ఆడిటోరియంలో, ఆర్మూర్‌లో పారిశుద్ధ్య ప్రణాళిక, హరితహారం, ఆదాయ వ్యయాలపై ఎంపీవోలు, పంచాయతీ సెక్రటరీలకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందుగా పల్లెలు అభివృద్ధి చెందాలని కలెక్టర్ పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల్లోనూ సిబ్బంది, వనరులు, అధికారాలు ఇచ్చి గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని తెలిపారు. అధికారులు అవగాహనతో పనిచేస్తూ ముందుకు పోవాలని సూచించారు.
మున్సిపాలిటీల్లో మాదిరిగా గ్రామ పంచాయతీల్లోనూ ప్రతిరోజూ డ్రైనేజీలు, రోడ్లు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వారానికి 2 సార్లు వార్డులను శుభ్రపరచాలన్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, డీఎఫ్‌వోలు, డీసీవోలతో కూడిన 10 మంది సభ్యుల బృందం సోమవారం నుంచి గ్రామాల్లో తనిఖీలు నిర్వహిస్తుందని తెలిపారు.