నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్య విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. చిన్నపిల్లలకు సంరక్షణ, పోషకాహారం, ప్రీ స్కూల్ విద్యను అందిస్తూ వారి సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతున్న అంగన్వాడీ కేంద్రాలను మూసివేయాలనడాన్ని తప్పుపట్టారు.
అంగన్వాడీల స్థానంలో బాలవాటిక, కిండర్ గార్డెన్ స్కూల్స్ పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అది అమలు జరిగితే అంగన్వాడీ ఉద్యోగులందరూ ఉపాధి కోల్పోవాల్సి వస్తుందని అంతేకాక పేద ప్రజలకు అందుతున్న పోషకాహార సేవలు కూడా దూరమవుతాయని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు అన్నారు. గత 45 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల సేవలను ప్రభుత్వం విస్మరించడం అత్యంత దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కే. దేవగంగు, జిల్లా కార్యదర్శి పి. స్వర్ణ, జిల్లా నాయకులు సునంద, సూర్యకళ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'ఈనెల 5న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలకు పిలుపునిచ్చిన ఏఐకేఎస్‌సీసీ'