Prakash Raj On Natural Farming: నిజామాబాద్ జిల్లాలో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్, నిర్మాత దిల్‌రాజ్ సందడి చేశారు. మోపాల్ మండలం నర్సింగ్‌పల్లి గ్రామంలోని ఇందూరు తిరుమల దేవస్థానాన్ని వారు దర్శించుకున్నారు. అనంతరం మా పల్లె ట్రస్ట్ చేపట్టిన ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు పండించే విధానాన్ని ప్రముఖ సేంద్రియ నిపుణులు విజయ్రామ్తో కలసి వీక్షించారు.
ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు వారు పండించే విధానాన్ని ప్రకాశ్‌రాజ్ అడిగి తెలుసుకున్నారు. మా పల్లె ట్రస్ట్ వెబ్‌సైట్‌ను ప్రకాశ్‌రాజ్ ప్రారంభించారు. రైతు వ్యాపారవేత్తగా మారి తాను పండించిన పంటను.. తానే అమ్ముకునే స్థాయికి ఎదిగినప్పుడే రైతు రాజు అవుతాడని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయంపై మక్కువ పెంచుకొని ఆచరించాలని ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు.
మా పల్లె ట్రస్టులో ఆర్గానిక్ వ్యవసాయం చాలా బాగుందని ప్రకాశ్‌రాజ్ తెలిపారు. చాలా రకాల దేశీయ విత్తనాలను కాపాడుతున్నారని చెప్పారు. తద్వారా ప్రకృతి వ్యవసాయం వల్ల ముందు తరాలకు చాలావరకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మా పల్లె ట్రస్ట్ వ్యవస్థాపకులు నరసింహారెడ్డి, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, తదితరులు పాల్గొన్నారు.
"రైతుగా ఉంటే సరిపోదు. రైతు వ్యాపారి కావాలి. మాభూమి మామట్టి అని ఉండాలి. ఇలాంటివి మీరే చేసుకోవాలి. చాలా మంది రావాలి. ఈగ్రామం మోడల్‌గా మారాలి. నావంతు అండగా ఉంటాను." - ప్రకాశ్‌రాజ్ సినీ నటుడు
ఇవీ చదవండి: 'రోగి డిశ్చార్జ్ అయ్యే సమయంలోనే అవసరమైన మందులు ఉచితంగా ఇవ్వాలి'