Woman Delivery On Roadside Nirmal : వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల గోసలు వర్ణణాతీతం. సరైన రోడ్డు సౌకర్యాలు, వైద్య సదుపాయాల లేమితో.. అత్యవసర సమయాల్లో ప్రాణాపాయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నొప్పుల బాధతో తల్లడిల్లుతున్న గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌కు కాల్ చేస్తే.. డీజిల్ లేదని సిల్లీ రీజన్ చెప్పారు. డీజిల్ కోసం డబ్బును ఫోన్ పే చేసిన గంట తర్వాత ఘటనాస్థలికి వచ్చారు. అప్పటికే ఆ మహిళ నాలుగు గంటలపాటు పురిటినొప్పులతో నరకం అనుభవించి బిడ్డకు జన్మనిచ్చింది.
Woman Gives Birth On Roadside in Nirmal : నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని పెంబి మండలం తులసీపేట్ మారుమూల గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ గంగమణికి.. గురువారం సాయంత్రం 7 గంటలకు పురిటి నొప్పులు వచ్చాయి. భర్త అంబులెన్స్‌కు ఫోన్ చేయగా సదరు గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో.. రోడ్డు ఉన్న ప్రాంతం వరకు రావాలని అంబులెన్స్ సిబ్బంది సూచించారు. వెంటనే స్థానిక ప్రజల సహకారంతో దొత్తి వాగు దాటించి రోడ్డు పైకి వచ్చారు. తీరా చూస్తే అంబులెన్స్ రాలేదు.
Woman Gives Birth On Roadside in Khanapur : మళ్లీ ఫోన్ చేయగా.. వాహనంలో డీజిల్ లేకపోవడంతో రాలేక పోతున్నామని ఐటీడీఏ అంబులెన్స్ డ్రైవర్ పేర్కొన్నాడు. గర్భిణి భర్త.. డీజీల్ ఖర్చుల నిమిత్తం అంబులెన్స్ డ్రైవర్‌కు ఆన్లైన్లో డబ్బు పంపాడు. అనంతరం ఫోన్ చేసినా ఎటువంటి స్పందన లేదు. ఆలస్యం కావడంతో పురిటినొప్పులను భరించలేక రోడ్డుపైనే ఆ మహిళ ప్రసవించింది. అంతా అయిపోయాక 11 గంటల ప్రాంతంలో అంబులెన్స్ రావడంతో తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించారు.
"నా భార్యకు రాత్రి ఏడు గంటలకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. అంబులెన్స్‌కి ఫోన్ చేస్తే మీ గ్రామానికి రోడ్డు లేదు.. రోడ్డు సౌకర్యం ఉన్న ప్రాంతానికి తీసుకురావాలని సూచించారు. వాగు దాటించి రోడ్డు ఉన్న ప్రాంతానికి వచ్చి.. ఫోన్ చేస్తే అంబులెన్స్‌లో డీజిల్ లేదన్నారు. నేను డీజిల్ కోసం అంబులెన్స్ డ్రైవర్‌కు డబ్బులను ఫోన్‌పే చేశాను. నొప్పులు భరించలేక రోడ్డుపైనే ప్రసవం అయ్యింది. ఆ తర్వాత అంబులెన్స్ వచ్చింది. ఇప్పుడు తల్లీబిడ్డ బానే ఉన్నారు. కానీ ఆ 4 గంటలు ఆమె ఎంత నరకం అనుభవించిందో.. తల్లీబిడ్డకు ఏమవుతుందోనని మేం అంతే భయపడ్డాం. దేవుడి దయ వల్ల ఏం కాలేదు. కానీ ఏమన్నా జరిగి ఉంటే. మా కుటుంబం తీరని విషాదంలో మునిగిపోయేది. ఇదంతా అంబులెన్స్ రాకపోవడం వల్లే. ప్రభుత్వం మమ్మల్ని ఓట్లుగానే కాకుండా మనుషుల్లా ట్రీట్ చేసి మాకు కనీస సౌకర్యాలు కల్పించాలి.". - కుర్మా మోహన్, మహిళ భర్త
తల్లీబిడ్డా క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ ఊహించని సంఘటన ఏదైనా జరిగి ఉంటే.. తమ పరిస్థితి ఏంటని మహిళ భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి.. అంబులెన్సులు వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.