ఈ నెల 20 నుంచి హరితహారం కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అన్ని జిల్లాల అటవీ శాఖ అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పురోగతి పనులను తెలుసుకున్నారు.
మొక్కలు - లక్ష్యాలు
ఈ ఏడాది నాటాల్సిన మొక్కల లక్ష్యాలు, ఇప్పటి దాకా నాటిన మొక్కల పరిస్థితిపై జిల్లాల వారీగా మంత్రి ఆరా తీశారు. ఇప్పటి వరకు అడవుల బయట 151 కోట్లు, అడవులలో 30 కోట్లు మొక్కలు నాటామని పీసీసీఎఫ్ఆర్ శోభ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వివరించారు.
హరితహారానికి సన్నద్ధం
అయితే గత ఐదు విడతల్లో నాటిన మొక్కల్లో బతికిన శాతం ఎంతని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరా తీశారు. అటవీ శాఖలో ప్రతీ ఉద్యోగి జవాబుదారీ తనంతో.. నాటిన ప్రతి మొక్క వంద శాతం బతకాలనే లక్ష్యంతో పని చేయాలని సూచించారు. అటవీ శాఖ మొక్కలు నాటిన చోట్ల 85శాతానికి పైగా మంచి ఫలితాలు ఉన్నాయని, ఇతర శాఖలు, బహిరంగ ప్రదేశాల్లో నాటిన మొక్కల్లో బతికిన శాతం తక్కువగా నమోదవుతోందని వివరించారు.
మంత్రి సమీక్ష - ముఖ్యాంశాలు
- ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టాన్ని కఠినంగా అమలుచేస్తున్నందున గ్రామాలు, పట్టణాల్లో అటవీ శాఖ తరఫున చక్కని సాంకేతిక సహకారాన్ని అందిస్తూ మొక్కలు నాటించాలని మంత్రి సూచించారు.
- ఆరవ విడతలో అడవుల బయట 20 కోట్లు, అడవులలో 1.90 కోట్లు మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు వివరించారు.
- ఇప్పటికే జిల్లాలు, శాఖల వారీగా లక్ష్యాలను సంబంధిత అధికారులకు నిర్ధేశించామన్నారు.
- 80 రోజులకు పైగా లాక్డౌన్ వల్ల పర్యావరణం బాగా మెరుగైందని, ఆ ఫలితాలను కొనసాగించేలా అటవీ శాఖ పనితీరు ఉండాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ఆర్ శోభ, అదనపు పీసీసీఎఫ్‌లు లోకేష్ జైస్వాల్, ఆర్.ఎం.డోబ్రియల్, శ్రీనివాస్, సునీతా భగవత్, అన్ని జిల్లాల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా.. సాంకేతిక అంశాలా : హైకోర్టు