నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని చాకిరేవు గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని గత ఐదు రోజుల నుంచి కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన దీక్షను గిరిజనులు శనివారం విరమించారు. నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు.
రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించి వసతులు కల్పించాలని ఆదేశించారు. దీంతో రెండు రోజుల క్రితం చాకిరేవు గ్రామంలో అధికారులు రెండు బోర్లు వేయించడంతో పాటు గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మళ్లీ పాదయాత్ర చేసి కలెక్టర్ కార్యాలయం ముందు దీక్ష చేస్తామని గిరిజనులు పేర్కొన్నారు. దీక్ష విరమించిన గిరిజనులకు డీఎస్పీ భోజనాలు ఏర్పాటు చేయించి.. వాహనాన్ని సమకూర్చి గ్రామానికి పంపించారు.
ఏం జరిగిదంటే
తమ గూడెంలో మంచినీటి, విద్యుత్ సౌకర్యం కల్పించకపోతే ఇక్కడి నుంచి కదిలేది లేదని గిరిజనులు స్పష్టం చేశారు. పిల్లలతో సహా 75 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టిన అనంతరం కలెక్టరేట్ ముందు నిరసన దీక్షకు దిగారు. గతేడాది జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. 5రోజులుగా పిల్లలు, మహిళలు, వృద్ధులు సైతం ఈ దీక్షలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: fire in forest: అడవిలో చెలరేగిన మంటలు..