బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) సీట్లను పాలిసెట్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. గ్రామీణ పేద విద్యార్థులకు సమీకృత ఇంజినీరింగ్ కోర్సులు అందించే లక్ష్యంతో ఏర్పాటైన ఆర్జీయూకేటీ.. ఇప్పటి వరకు సీట్లను పదో తరగతి మార్కుల ఆధారంగా భర్తీ చేశారు. ఇంటర్మీడియట్ ఎంపీసీ, ఇంజినీరింగ్ కలిపి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఆర్జీయూకేటీలో ఉన్నాయి. ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్‌లో ఈసీఈ, ఈఈ, సీఎస్ఈ, సివిల్, మెకానికల్, మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజినీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన విద్యార్థులకు ఆరేళ్ల పాటు పూర్తిగా ఉచిత విద్యను అందిస్తారు.
సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు సీట్లు దక్కేవి. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను రద్దు చేసి.. ఎఫ్ఏ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చారు. ఫలితంగా ఈ ఏడాది రాష్ట్రంలో సుమారు రెండున్నర లక్షల మంది విద్యార్థులకు 10 జీపీఏ వచ్చింది. ప్రస్తుత విధానం వల్ల ప్రతిభను గుర్తించడం కష్టమని భావించిన యూనివర్సిటీ.. పాలిసెట్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం అంగీకరించడంతో.. రాష్ట్ర సాంకేతిక విద్యామండలి పాలిసెట్ నోటిఫికేషన్ సవరించింది. రూ.100 ఆలస్య రుసుముతో ఈ నెల 27 వరకు, రూ.300ల ఆలస్య రుసుముతో ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. పాలిసెట్ పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తామన్నారు. పాలిటెక్నిక్, వ్యవసాయ యూనివర్సిటీతో పాటు పశువైద్య విశ్వవిద్యాలయం డిప్లొమా కోర్సులనూ ఈ ఏడాది పాలిసెట్ ద్వారానే భర్తీ చేయనున్నారు.
ఇదీ చూడండి: Rescue: వాగులో చిక్కుకున్న కూలీలు... కాపాడిన యువకులు