నిరుపేద కుటుంబంలో పుట్టిన శ్యాం జీవితం కష్టాల కడలిలో సాగుతోంది. చిన్నతనంలోనే తండ్రి బాబును కోల్పోగా తల్లి లక్ష్మి కాయాకష్టం చేసి శ్యాంతోపాటు కూతురును పోషిస్తోంది. ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో డిగ్రీ పూర్తి చేసిన అతన్ని దివ్యాంగుల కష్టాలు ప్రేరేపించాయి. వారికి చేయూత ఇవ్వాలనే తపనతో దివ్యాంగుల కోసం పనిచేసే ఓ సంస్థలో చేరారు. సంస్థ ప్రోద్బలంతో ప్రపంచ వ్యాప్తంగా సేవలందించే చెన్నైలోని ముక్తి ట్రస్ట్ ద్వారా కృత్రిమ అవయవాల తయారీలో శిక్షణ తీసుకున్నారు. వాటి తయారీలో కొత్త పద్ధతులు, ఆకృతులు, ముడిసరకు, నాణ్యతా ప్రమాణాలపై దక్షిణాఫ్రికా, శ్రీలంక దేశాల్లో నిర్వహించిన శిబిరాల్లో పాల్గొన్నారు. ఇక్కడ ముథోల్‌లో పని చేస్తున్న సంస్థ మూతపడడంతో చేతికి పనిలేకుండా పోయింది.
ప్రస్తుతం నిజామాబాద్‌లోని రోటరీక్లబ్ నిర్వహించే శిబిరాలకు వెళ్లి దివ్యాంగులకు సేవలందిస్తున్నారు. శిబిరాల రోజుల్లోనే వేతనం లభిస్తుంది. మిగతా రోజుల్లో ఇంటికి వచ్చే బాధితులకు చేయూత అందిస్తున్నారు. పక్షవాతం, పోలియో, ప్రమాదాల్లో కాళ్లు, చేతులు కోల్పోయిన వారికి తయారీ ఖర్చులు(రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు) తీసుకుని డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలతో జైపూర్ తరహా (దాదాపు రూ.40 వేలు తీసుకునే) కృత్రిమ అవయవాలు అమర్చుతున్నారు. వాటి తయారీకి హెచ్‌డీపీఈ గొట్టాలను 250డిగ్రీల ఉష్ణోగ్రతతో వేడి చేయానిడానికి ఉపయోగించే ఓవెన్ అనే ఉపకరణం కొనుగోలు చేసే శక్తి లేక ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యి, ఇనుప డబ్బాను ఉపయోగిస్తూన్నారు. అతని సేవాభావాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రభుత్వం చేయూతనిస్తే యువతకు ఉపాధితోపాటు కృత్రిమ అవయవాలు తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది.
చేయూతనిస్తే సేవలు విస్తృతం చేస్తా.. 'దివ్యాంగులకు సేవ చేయాలనే తపనతో ముందుకెళ్లాను. ముథోల్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా కృత్రిమ అవయవాల తయారీలో శిక్షణ తీసుకున్నాను. అదే ఉపాధి మార్గమైంది. ప్రస్తుతం రోటరీక్లబ్ నిర్వహించే శిబిరాలకు వెళ్తున్నాను. ఇంటికి వచ్చేవారికి నామమాత్రపు ఖర్చులతో అవయవాలు అమర్చుతున్నాను. వాటి తయారీకి అవసరమైన విద్యుత్ యంత్ర పరికరం ‘ఓవెన్’ ధర రూ.1.5లక్షల ఉంటుంది. ఆ స్తోమత లేక కట్టెల పొయ్యి మీద హెచ్‌డీపీఈ పైప్‌లు వేడి చేస్తున్నాను. ప్రభుత్వం, సమాజ సేవకులు చూయూతనిస్తే ఇక్కడే యూనిట్ నెలకొల్పి పలువురికి ఉపాధి కల్పిస్తూ సేవలను విస్తరిస్తాను. - శ్యాం పాంచాల్, కోలూరు, తానూరు మండలం