నిర్మల్ (Nirmal) జిల్లా పోలీసులు లాక్ డౌన్ అమలును కఠినంగా అమలు చేసేందుకు సరికొత్త పంథా ఎంచుకున్నారు. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ (Lockdown)కు సహకరించాలని జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఉదయం 10 దాటితే బయటకు రావద్దని ఎంత చెప్పినా… వినకపోవడంతో రోడ్లపై తిరుగుతున్న వారికి ఏకంగా ఐసోలేషన్ సెంటర్ (Isolation center) కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో అనవసరంగా బయట తిరుగుతున్న ఆకతాయిలను పట్టుకొని శివాజీ చౌక్ లో కరోనా నిర్దరణ పరీక్షలు నిర్వహించారు.
జిల్లా కేంద్రంలో లాక్ డౌన్ మరింత కఠినతరం చేస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. ఇష్టం వచ్చినట్లు రోడ్లపై తిరుగుతున్న వారికి ఇలా అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. జులాయిగా రోడ్లపై తిరగొద్దని చెబుతున్నా.. కొంతమంది వినడం లేదని… ఉదయం 10 గంటల తర్వాత ఎలాంటి కారణం లేకుండా బయట తిరిగే వారికి కరోనా పరీక్షలు నిర్వహించి ఐసోలేషన్ సెంటర్ (Isolation center) కి తరలించేందుకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.