నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రభుత్వం ఇటీవల మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఇదే క్రమంలో రైతులు పంట నూర్పిడి అనంతరం దిగుబడులను కేంద్రాల్లో కుప్పలుగా పోసి ఉంచారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటుండటం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు.
గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అధిక మొత్తంలో నిల్వలు పేరుకుపోయాయి. గోనె సంచుల సరఫరాలో జాప్యం కారణంగా తూకం వేయలేకపోతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ఒకేసారి తూకం ప్రారంభిస్తే ఇబ్బందులు తలెత్తే వీలుంది. వచ్చిన పంటను వచ్చినట్లు తూకం చేస్తే మేలు చేకూరుతుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో తేమ శాతాన్ని సడలించి కొనుగోళ్లు చేపడితే త్వరలో వచ్చే దిగుబడుల కొనుగోళ్లకు సులువుగా ఉంటుంది. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని ఆయా మండలాల రైతులు కోరుతున్నారు.