Basara Rgukt: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులతో కలెక్టర్ చర్చలు విఫలమయ్యాయి. విద్యార్థి నాయకులతో కలెక్టర్ ముషారఫ్ అలీ చర్చించారు. కలెక్టర్ ముందు ఆర్జీయూకేటీ విద్యార్థులు 12 డిమాండ్లను ఉంచారు. తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానన్న కలెక్టర్... మిగతా అంశాలను పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. ఆర్జీయూకేటీకి రెగ్యులర్ వీసీని నియమించాలని, బాసర ఆర్జీయూకేటీని సీఎం సందర్శించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. డిమాండ్లపై హామీ రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు.
సమస్యల విలయతాండవం: బాసర ఆర్జీయూకేటీలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. కొన్ని నెలల క్రితం భోజనంలో పురుగులు, బొద్దింకలు వస్తున్నాయని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. కనీసం మంచినీటి వసతులు సరిగా లేవని పేర్కొన్నారు. ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోకపోవటంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. సమస్యలు పరిష్కరించాలంటూ రెండ్రోజులుగా నిరసన తెలుపుతున్నారు. రెండో రోజు కూడా విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది.
వాళ్లు రావాల్సిందే: ఆర్జీకేయూటీ ప్రధాన గేటు వద్దకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. గేటు వద్ద బైఠాయించి ఆందోళన చేపడుతున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగులు పట్టుకొని నిరసన తెలపుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన చేస్తామని వెల్లడించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకోవటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వారు బయటకు రాకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. భైంసా ఏఎస్పీ కిరణ్ కారే బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు.
ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ధర్నాకు వివిధ పార్టీల నాయకులు మద్దతు పలికారు. విద్యాలయం వద్దకు వెళ్లిన వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థుల ఇబ్బందులను పరిష్కరించాలని ఏబీవీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: