నిర్మల్ జిల్లాలో ప్రజలు గణేష్ నిమజ్జన శోభాయాత్రను శాంతి సామరస్యంతో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. శనివారం కలెక్టరేట్లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులతో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యంగా నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లో శోభాయాత్ర సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా చర్యలు చేపట్టాలని, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యుల సమన్వయంతో శోభా యాత్రను విజయవంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఆర్వో సోమేశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, నిర్మల్, బైంసా ఆర్డీవోలు రాథోడ్ రమేష్, రాజు, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, సీఐ జాన్ దివాకర్, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: భారత్‌లో దాతృత్వం, మానవత్వానికి కొదవలేదు: ఈటల