నిర్మల్ జిల్లాలో రైతు వేదికల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ అలీ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆయన అధికారులతో సమావేశమయ్యారు. నిర్మాణ పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాకు మంజూరైనా 79 రైతు వేదికల్లో ఇప్పటివరకు చిట్యాల, హంపోలి, తాండ్ర గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. మిగతా చోట్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. కూలీల సంఖ్యను పెంచి త్వరగా రైతు వేదికల నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రైతు వేదిక ప్రాంగణంలో పచ్చదనం పెంపొందేలా విధిగా మొక్కలు నాటాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు.
ఇదీ చూడండి: వరుస ఎన్నికలపై కారు నజర్.. పకడ్బందీ వ్యూహంతో కార్యాచరణ