నిర్మల్ జిల్లా ప్రభుత్వ విద్యాసంస్థలో చదివే విద్యార్థులు ఆన్లైన్ తరగతులకు వందశాతం హాజరయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ ఆదేశించారు. డిజిటల్ తరగతుల నిర్వహణ, విద్యార్థుల హాజరు, తదితర అంశాలపై విద్యా, సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల వసతి గృహాల విద్యార్థులు వందశాతం ఆన్లైన్ తరగతులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు యాభై శాతం హాజరవ్వాలని తెలిపారు. తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి డిజిటల్ తరగతుల నిర్వహణ తదితర అంశాలపై చర్చించాలన్నారు.
ఆన్లైన్ తరగతులకు హాజరు కాని ప్రతి విద్యార్థి ఇంటికెళ్లి సబ్జెక్టుల వారీగా సమస్యలను నివృత్తి చేయాలన్నారు. వారు హాజరయ్యేలా ఉపాధ్యాయులు, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు ప్రోత్సహించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో మండల విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించి.. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రిపోర్టును ప్రతిరోజు అందజేయాలని పేర్కొన్నారు. త్రాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, కనీస మౌలిక సదుపాయాలు ప్రతి పాఠాశాలలో కల్పించుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇదీ చూడండి:ఆన్లైన్ పాఠాల కోసం ఆరు కిలోమీటర్లు నడక..