నిర్మల్ జిల్లా భైంసా అల్లర్ల వెనుక ఎవరున్నా, ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఘర్షణలు చోటుచేసుకున్న మహాగావ్ గ్రామంతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాలు, దుకాణాలు దగ్ధమైన ప్రాంతాలను పర్యటించి, బాధితులను పరామర్శించారు. జర్నలిస్టులపై దాడి జరగడం విచారకరమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. భైంసా ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, దీని వెనక ఎవరు ఉన్నారో దర్యాప్తులో తేలుతుందని పేర్కొన్నారు. బాధితులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.
అభివృద్ధి క్షీణిస్తోంది
భైంసా పట్టణ ప్రజలను ఈ స్థితిలో చూడటం బాధ కలిగిస్తోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. జనజీవనం స్తంభించడంతో కూలీ నాలీ చేసుకునే వారు ఇబ్బందులు పడుతున్నారని.. చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వెలిబుచ్చారు. వరుస ఘటనలతో అభివృద్ధి కుంటుపడుతోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా రాజకీయాలకు అతీతంగా కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి స్పష్టం చేశారు. వీటి నుంచి పలు రాజకీయ పార్టీలు లబ్ధి పొందాలని చూస్తున్నాయని.. ఈ అల్లర్ల వెనుక ఏ పార్టీ హస్తం ఉందో అందరికీ తెలుసని అభిప్రాయం వ్యక్తం చేశారు.
తెరాసపై అసత్య ఆరోపణలు
మహాగావ్లో తెారాసకు చెందిన కార్యకర్త ఆటోను దగ్ధం చేశారని.. కానీ కొంతమంది ఈ అల్లర్ల వెనుక ప్రభుత్వ హస్తం ఉందనే అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. అసత్య ఆరోపణలను సహించేది లేదని హెచ్చరించారు. పర్యటనలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ ముషర్రఫ్ అలీ ఫారుఖీ, ఎస్పీ విష్ణు వారియర్, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రాచకొండ పోలీసులను అభినందించిన రాజాసింగ్