మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలంటే చదువు తప్పనిసరని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
మహిళలు పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో దూసుకుపోవడం ఎంతో గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం షీ-టీంలను ఏర్పాటు చేసిందని తెలిపారు. పేదింటి ఆడబిడ్డల వివాహాల కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈ సందర్భంగా చట్టసభల్లో రిజర్వేషన్లు పెంచితే.. మహిళలు రాజకీయంగా మరింత చైతన్యవంతులయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువురు మహిళలను శాలువాలతో సన్మానించారు.
వేడుకల సందర్భంగా చిన్నారుల నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ కొరిపెళ్లి విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ నర్మద, పలువురు మహిళా కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: చట్ట సభల్లో మహిళల ప్రాతినిథ్యం పెరగాలి: తలసాని