ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతం గడిచిన ఆరేళ్లలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో అద్భుత ప్రగతితో ముందుకు సాగుతోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలోని మామడ మండల కేంద్రం, కడెం మండలం బెల్లాల్లో రైతు వేదికల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేసి మొక్కలు నాటారు. బెల్లాల్ లో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.
తెలంగాణ అద్భుతమైన పంటలు పండించే రాష్ట్రమని మంత్రి తెలిపారు. కానీ ఉమ్మడి పాలనలో పాలకుల నిర్లక్ష్యంతో పంటలు ఎండిపోయి తెలంగాణ వ్యవసాయం దారుణంగా దెబ్బతిందన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రకటించి అమలు చేస్తున్నామని అయన తెలిపారు. మార్కెట్, భూసారాన్ని అనుసరించి పంటలు సాగు చేస్తే రైతులకు లాభం ఉంటుందని, అందుకే నూతన వ్యవసాయ విధానాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. నియంత్రిత సాగు విధానంతో రైతులు ప్రయోజనాలు పొంది ఆర్థికంగా పరిపుష్టి చెందుతారన్నారు.
రైతులు ఐక్యంగా ఉండేందుకు రైతువేదికలు దోహదం చేస్తాయని మంత్రి వెల్లడించారు. దేశంలో ఎవరూ చేయని విధంగా రైతుల అవసరాలు తీర్చేందుకు ముఖ్యమంత్రి పలు పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా రెండు పంటలకు గానూ ఎకరానికి రూ. 10 వేలు అందిస్తున్నామన్నారు. కరోనా కష్టకాలంలో కూడా రైతుబంధు కోసం రూ.7 వేల కోట్లను మంజూరు చేశామని చెప్పారు. రైతులకు ముందస్తుగానే పెట్టుబడి డబ్బులు సమకూరడంతో పాటు ఎరువులను, విత్తనాలను అందించడంతో సకాలంలో పంటలను వేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కరోనాతో ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు: సీఎం