రైతులను సంఘటితం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించిందని దేవాదాయ, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని చించోలి (బి) గ్రామంలో రూ. 22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణం, రైతు బంధు దేశానికే ఆదర్శమని మంత్రి అన్నారు. రైతులందరూ ఒకేచోట చేరి తమ సమస్యలను చర్చించుకొనేందుకు ఈ వేదికలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
రైతన్నలకు మద్దతు
తెలంగాణలో రైతు ప్రభుత్వం కొనసాగుతోందని.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని మంత్రి అన్నారు. కానీ రైతు వ్యతిరేక చట్టాలతో వారికి కేంద్రం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. రైతులను కలవడానికి వెళ్లిన ప్రతిపక్ష నాయకులను ముళ్ల కంచెలతో పోలీసులు అడ్డుకున్నారని విమర్శించారు. ప్రపంచంలోని సెలబ్రెటీలు ఆందోళన చేస్తున్న అన్నదాతలకు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ విజయలక్ష్మి, రైతు సమన్వయ సమితి వెంకట్ రామిరెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రైతు వేదికలు సిద్ధం.. ఇక ప్రారంభించడమే ఆలస్యం.!