నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పంచగుడి గ్రామంలో బ్రిడ్జి, రహదారి వెడల్పు భూసేకరణలో భూములు కోల్పోయిన భూనిర్వాసితులకు పరిహారం అందించారు. రెండున్నర కోట్ల విలువైన చెక్కులను బాధితులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అందించారు. భూ నిర్వాసితులలో ధర్మోర, లోకేశ్వరం, నగర్, పంచగుడి, రాయపూర్ కాండ్లికి చెందిన 200 మంది లబ్ధిదారులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కలిసి చెక్కులు పంచారు.
నిజామాబాద్, నిర్మల్ జిల్లాల ప్రజలకు పంచగుడి బ్రిడ్జి, రోడ్డు నిర్మాణ పనుల వల్ల దూరం తగ్గి రాకపోకలు సులభమవుతాయన్నారు. రాష్ట్రంలో దేవాలయాలకు కేటాయిస్తున్న నిధులపై సంబంధిత గ్రామాల వీడీసీలకు బాధ్యతలను ఇస్తున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. దేవాలయాల పునరుద్ధరణ పనులను కాంట్రాక్టర్లకు ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం రద్దు చేస్తున్నట్టు తెలిపారు.
మక్క కొనుగోళ్లకు ఛత్తీస్గఢ్లో 1300 రూపాయలు మాత్రమే చెల్లిస్తే తెలంగాణ ప్రభుత్వం రూ.1,740 చెల్లిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని.. రైతు దిగులు చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి విజ్ఞాపన మేరకు అర్లీ బ్రిడ్జి రూ.35 కోట్లతో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని మంత్రి వాగ్ధానం చేశారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా