నిర్మల్ జిల్లా అభివృద్ధే ధ్యేయమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ఈదిగాం చౌరస్తా రూ.70 లక్షలతో ఏర్పాటుచేసిన హైమాస్ లైటింగ్ సిస్టంను ప్రారంభించారు. నూతనంగా ఏర్పడిన నిర్మల్ జిల్లా అభివృద్ధి కోసం ప్రభుత్వం అధికంగా నిధులు మంజూరు చేస్తోందని మంత్రి తెలిపారు. స్థానిక చైన్‌గేట్ నుంచి బంగల్పేట్ వరకు రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇందుకు ప్రజలు సహకరించడం అభినందనీయమన్నారు.
ఈదిగాం చౌరస్తా నుంచి శివాజీ చౌక్ వరకు రూ.2 కోట్ల నిధులతో రోడ్డు మరమ్మతులు చేపడుతున్నట్లు వివరించారు. రూ.50 లక్షలతో చేపల మార్కెట్‌ను త్వరలో నిర్మిస్తామని తెలిపారు. ప్రయాణ ప్రాంగణం వద్ద రూ.10 కోట్ల సమీకృత మార్కెట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శ్యాంఘడ్ కోట చుట్టూ లైటింగ్ సిస్టం, కంచరోని చెరువులో బోటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.