ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉద్యమంలా పాల్గొనాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
నేటి నుంచి 8 రోజుల పాటు నిర్వహించే ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి కోరారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు ఎవరి ఇంటి పరిసరాలను వారు శుభ్రపరచుకోవాలని అన్నారు.
ఈ సందర్భంగా సోఫీనగర్ చెరువు ఆక్రమణకు గురైనట్లు పలువురు తనకు ఫిర్యాదు చేశారన్న మంత్రి.. చెరువు సర్వే చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా చెరువులను, శిఖం భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, మున్సిపల్ ఛైర్మన్ గండ్ర ఈశ్వర్, ఎఫ్ఏసీఎస్ ఛైర్మన్ ధర్మాజీ రాజేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎర్రవోతు రాజేందర్, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి: ఉత్తమ్‌పై తన వ్యాఖ్యలను సమర్థించుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి