ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కింద అందజేస్తున్న రైతుబంధు పథకం జిల్లాలో వందలాది మంది అన్నదాతలకు అందని ద్రాక్షలా మారింది. కొంతమంది రెవెన్యూ సిబ్బంది అలసత్వం కారణంగా గతేడాది ఖరీఫ్, రబీ సీజన్‌లకు సంబంధించి అన్నదాతలకు పెట్టుబడి సాయం అందలేదు. ఆన్‌లైన్‌లో భూముల వివరాలు తప్పుగా నమోదు చేయడంలో ఏడాది నుంచి పాసు పుస్తకాల కోసం అన్నదాతలు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోతున్నాయి.
లోపాలు సరిచేసి రికార్డుల నవీకరణ
రైతు కష్టాలు దూరం చేయటంతో పాటు ప్రభుత్వ భూములు ఏయే సర్వేనెంబర్లలో ఉన్నాయో గుర్తించడం, ఇతరత్రా రెవెన్యూ సమస్యలకు పరిష్కారం చూపడానికి నిర్మల్ ఇన్‌ఛార్జి జిల్లా పాలనాధికారి ఎ.భాస్కర్‌రావు ప్రత్యేక దృష్టి సారించారు. భూ సమస్యలన్నీ పరిష్కరించడానికి ఆరు రోజుల ప్రత్యేక కార్యశాల ప్రక్రియకు సోమవారం శ్రీకారం చుట్టారు. ఇక పట్టాదారు పాసు పుస్తకాల సమస్య శాశ్వతంగా పరిష్కారం కానుండటంతో అన్నదాతల ఇబ్బందులు దూరం కానున్నాయి.
ఆరు రోజులపాటు ప్రత్యేక కార్యచరణ
పట్టాదారు పాసు పుస్తకాల తప్పుల సవరణతో పాటు ఇప్పటివరకు జారీ చేయని పాసు పుస్తకాల కోసం ఆరు రోజుల పాటు కార్యశాల కొనసాగనుంది. ఆరు రోజుల జిల్లా పాలనాప్రాంగణంలో జరిగే ఈ కార్యశాలలో జిల్లాలోని 19 మండలాల తహసీల్దార్లు, వీఆర్వోలు, సిబ్బంది అక్కడే తిష్ఠ వేసి తప్పులను సరిచేయనున్నారు. పట్టాదారు పాసుపుస్తకాల లోపాల సవరణతో పాటు విరాసత్‌లు, తదితర సమస్యల పరిష్కారానికి మండలాల రైతులు జిల్లా పాలనాప్రాంగణానికి రావాల్సిన అవసరం లేదు. ఆయా మండల తహసీల్దార్ కార్యాలయాల్లో నయాబ్ తహసీల్దార్లకు సమస్యను విన్నవిస్తే సరిపోతోంది. ఆ అధికారి వీఆర్వోల ద్వారా ఆ సమస్యను కార్యశాలలో ఉండే తహసీల్దార్లకు సమస్యను వివరించి పరిష్కరించేలా చూస్తారు. నిర్మల్ జిల్లాలో రెవెన్యూ, భూప్రక్షాళనకు అధికారులు చొరవచూపటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.