స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతి వేడుకలు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పాలనా ప్రాంగణంలో పాలనాధికారి ముషారప్ ఫారూఖీ నేతృత్వంలో వేడుకలను జరిపారు. అక్కడి నుంచి కార్యాలయ సమీపంలో బాపూజీ కాంస్య విగ్రహానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమంలో ఎంతో పోరాడారని మంత్రి ఇంద్రకరణ్ అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు బాపూజీ మంచి సన్నిహితులని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసి కావడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్, పట్టణ కౌన్సిలర్లు, పద్మశాలి కుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.