CM KCR Nirmal Tour : నిర్మల్ జిల్లా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్... తొలుత ఆయన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడినుంచి నేరుగా ముఖ్యమంత్రి కొండాపూర్ వద్ద నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.
CM KCR Inaugurate New Collectorate in Nirmal : రాష్ట్రం ఏర్పడ్డాకనే ఆసిఫాబాద్‌కు వైద్య కళాశాల వచ్చిందని కేసీఆర్ తెలిపారు. దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని వివరించారు. ఈ క్రమంలోనే జిల్లాకు చెందిన ముఖరా(కె) గ్రామానికి చాలా అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి చాలా ఉందని పేర్కొన్నారు. పోడు భూముల లబ్ధిదారులకు పట్టాలు ఇస్తామని.. ఈ సీజన్ నుంచే రైతు బంధు ఇవ్వనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు మాత్రమే ఇవ్వడం జరిగిందని సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు... ప్రజలకు పథకాలు అందేలా చూడాలని వివరించారు. సమీకృత కలెక్టరేట్ ఏర్పాటు కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. నిర్మల్ కలెక్టరేట్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. నిర్మల్, ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున నిధులు.. జిల్లాలోని 19 మండలాలకు రూ.25 లక్షల చొప్పున నిధులు విడుదల చేస్తామన్నారు. పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ అగ్రస్థానంలో నిలిచిందని సీఎం వివరించారు.
భయంకరమైన దోపిడీ జరిగేది : ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా విద్యాశాఖ, అధికారులను అభినందిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. బాసర సరస్వతి ఆలయాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఈ క్రమంలోనే ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని చెప్పారు. జిల్లాలో 2,000ల డబుల్ బెడ్‌రూం ఇళ్లు అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. గతంలో రెవెన్యూ విభాగంలో భయంకరమైన దోపిడీ జరిగేదని కేసీఆర్ గుర్తు చేశారు.
KCR on Dharani Portal : ఈ క్రమంలోనే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని కేసీఆర్ విమర్శించారు. మళ్లీ అవినీతికి తెరలేపడానికి హస్తం నాయకుల యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ధరణిని తొలగిస్తే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయా అని ప్రశ్నించారు. ధరణి పోర్టల్‌ను తొలగించాలా? వద్దా? అని ప్రజలు ఆలోచించాలని సూచించారు. కాంగ్రెస్ హయాంలో దోపిడీతో ప్రజలు అవస్థలు పడ్డారని కేసీఆర్ పేర్కొన్నారు .
KCR fires on Congress : బంగాళాఖాతంలో వేయాలన్న వారినే.. బంగాళాఖాతంలో కలపాలని కేసీఆర్ పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలతో ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఎస్‌ఆర్‌ఎస్పీ కింద 2 స్కీమ్‌లను త్వరలో పూర్తిచేస్తామని వెల్లడించారు. తద్వారా లక్ష ఎకరాలకు నీళ్లందుతాయని తెలిపారు. ఈ క్రమంలోనే ఈనెల 8న గ్రామాల్లో చెరువుల వద్ద పండుగ నిర్వహించాలన్నారు. ఎన్నికలు వస్తున్నందున కొందరు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని కేసీఆర్ విమర్శించారు.
"గిరిజన తండాలను అభివృద్ధి చేశాం. 196 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశాం. గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలు మంజూరు చేస్తున్నాం. రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ చేపడుతున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేస్తాం. జిల్లాలో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తున్నాయి." -కేసీఆర్, ముఖ్యమంత్రి
ఇవీ చదవండి: CM KCR Speech at TS Formation Day 2023 : 'నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణ'