జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో నిరసన తెలిపారు. సుమారు మూడున్నర గంటలపాటు కార్యాలయ ఆవరణలో బైటాయించారు. పనిభారం తగ్గించాలని కోరుతూ శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఉన్నతాధికారులకు సమస్యలను వివరించేందుకు రాత్రి 8 గంటల వరకు అక్కడే పడిగాపులు పడ్డారు.
దీంతో అదనపు పాలనాధికారి భాస్కర్ రావు ఉద్యోగుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలుంటే ప్రతినిధుల ఆధ్వర్యంలో తమ దృష్టికి తీసుకురావాలని, కొవిడ్- 19 కారణంగా గుంపులుగా రావడం సరికాదని మండిపడ్డారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు పనివేళలు కావడం వల్ల మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురవుతున్నామని జూనియర్ కార్యదర్శులు పేర్కొన్నారు. దీనికితోడు ఉపాధి హామీ పనులను సైతం అప్పగించడం వల్ల పనిభారం పెరుగుతోందని, లైవ్ లొకేషన్ వల్ల ఉద్యోగులు ప్రశాంతంగా పని చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ భవనాల్లో మౌలిక వసతులు లేకపోవడం వల్ల ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు.
ఉన్నతాధికారులు స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. చివరకు మాజీ డీసీసీబీ అధ్యక్షుడు రాంకిషన్ రెడ్డి జోక్యంతో ఇద్దరు ప్రతినిధులు పాలనాధికారి ముషర్రఫ్ ఫారూకీకి తమ సమస్యలను వివరించారు. పల్లె ప్రగతి ముగిశాక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం వల్ల ఆందోళన విరమించారు.
ఇవీ చూడండి: సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్