తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక రాష్ట్రంలో వరుస దొంగతనాలు చేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను నిర్మల్ జిల్లా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి దుకాణాలే లక్ష్యంగా చేసుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ శశిధర్‌రాజు తెలిపారు. వారం రోజుల క్రితం నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంతో పాటు దిమ్మదుర్తి గ్రామాల్లోని దుకాణాల షెట్టర్లను చాకచక్యంగా ఎత్తి దొంగతనాలకు పాల్పడ్డారని వివరించారు. అక్కడి సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
శుక్రవారం రాత్రి న్యూసాంగ్వి గ్రామ సమీపంలో వాహనాలను తనిఖీ చేసే క్రమంలో అనుమానాస్పదంగా ముఠా సభ్యులు కనిపించడం వల్ల పోలీసులు పట్టుకుని విచారించారు. పలు ప్రాంతాలలో సుమారు 30 చోట్ల దొంగతనాలకు పాల్పడ్డట్టు దర్యాప్తులో తేలిందని అన్నారు. ముఠాసభ్యుల్లో ముగ్గురిని అరెస్టు చేసినట్లు, ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. వారి వద్ద నుంచి రెండు కార్లు, సెల్‌ఫోన్, దొంగతనానికి వినియోగించిన సామాగ్రి, 9 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు అధికారులు అనూష, లక్ష్మణచాంద, వినయ్‌కుమార్, జీవన్‌రెడ్డి, ఉపేందర్రెడ్డిలను ఎస్పీ అభినందించారు.
ఇదీ చూడండి : ఉరేసరి... వైద్యురాలి హత్యపై భగ్గుమన్న సమాజం