governor tamilisai on rgukt problems: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో అనేక సమస్యలు ఉన్నాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి చేసి.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ట్రిపుల్ ఐటీలో విద్యార్థులను కలుసుకున్న గవర్నర్.. క్యాంపస్‌లో కలియ తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నారు. సరిపడా అధ్యాపకులు లేకపోవడంతో పాటు.. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విద్యార్థులు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా క్యాంపస్‌లో సరైన మెస్ సౌకర్యం లేదన్న గవర్నర్.. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం లేదని తెలిపారు. విద్యార్థుల ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్న తమిళిసై.. సంబంధిత శాఖలపై ఒత్తిడి తీసుకొచ్చి వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు ప్రొటోకాల్ విషయంపై గవర్నర్ స్పందించారు. తన విషయంలో ప్రొటోకాల్ అంశం బహిరంగ రహస్యమేనని వ్యాఖ్యానించారు. అనంతరం అక్కడి నుంచి తెలంగాణ యూనివర్సిటీకి బయలుదేరారు.
ఆర్టీయూకేటీలో చాలా సమస్యలు ఉన్నాయి. విద్యార్థులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. విద్యార్థులకు సరిపడా అధ్యాపకులు లేరు. వసతి గృహంలో మెస్ నిర్వహణ బాగాలేదు. 2017 నుంచి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వట్లేదు. భోజనం విషయంలో విద్యార్థులు అసహనంతో ఉన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించదగినవే. నా ప్రొటోకాల్ విషయం బహిరంగ రహస్యమే. - తమిళిసై, గవర్నర్
అంతకుముందు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన గవర్నర్కు ఆలయ అర్ఛకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు.