నిర్మల్ జిల్లాలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులను నష్టాల పాలు చేసింది. జిల్లాలో అక్కడక్కడ ఈదురు గాలులతో వర్షం కురవడం వల్ల పంట నేలకొరిగింది. మాదాపూర్, జఫరాపూర్, పాకపట్ల గ్రామాల్లో చెతికొస్తున్న దశలో సజ్జ, నువ్వు పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరికొన్ని గ్రామాల్లో ఉడికించి ఆరబెట్టిన పసుపు కాస్త తడిసి ముద్దయింది. ఈ విపత్తుతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంట పండించడం ఒక ఎత్తయితే... అమ్మడం మరో ఎత్తు అవుతుందని వాపోతున్నారు.
పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక నష్టపోతామో.. లాభ పడతామో అని తెలియక అయోమయంలో ఉండగా వరుణుడి ప్రతాపంతో మరింత నష్టపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేయాలనుకున్నా యువకులు నిరుత్సాహ పడాల్సి వస్తుందన్నారు. గత ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి తప్పారని రైతులు పేర్కొన్నారు.
జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. తడిసిన పసుపుకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి: 'ఓటు వినియోగమే కాదు... ఫిర్యాదులూ చేయండి'