Fake Whats app: నిర్మల్ జిల్లా కలెక్టర్ పేరిట నకిలీ ఖాతా. వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా నిర్వాహకుల బరితెగింపును బట్టబయలు చేస్తోంది. సామాన్యులు, ప్రభుత్వ ఉద్యోగుల వివరాలతో నకిలీ వాట్సాప్ ఖాతాలు సృష్టించి, వారి సంబంధీకుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటనలు తరచూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా నిర్మల్ కలెక్టర్ ప్రొఫైల్‌తో నకిలీ వాట్సాప్ సందేశాలు వస్తున్నాయని గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులకు ఆ నంబరు నుంచి సందేశాలు వచ్చాయని.. వాటితో జిల్లా యంత్రాంగానికి ఎలాంటి సంబంధం లేదని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ ఇవాళ ప్రకటన జారీచేశారు.
6201570373 నంబరుతో ఉన్న వాట్సాప్ నుంచే సందేశాలు, సూచనలు ఎవరూ నమ్మవద్దన్నారు. ఇలాంటి నకిలీ నంబర్ల పట్ల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నంబర్ నుంచి ఎవరికైనా సందేశాలు వస్తే అధికారులకు తెలియజేయాలన్నారు. ఇప్పటికే ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదీ చూడండి: సూపర్ బ్రదర్స్.. నడవలేని చెల్లిని డోలీలో మోస్తూ పరీక్షా కేంద్రానికి...