నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్ మండలం టెంబుర్నీలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో గుప్త నిధుల కోసం దుండగులు తవ్వకాలకు ప్రయత్నించారు. హైదరాబాద్కు చెందిన ఆరుగురు వ్యక్తులు క్వాలిస్ వాహనంలో టెంబుర్నీకి చేరుకున్నారు. గ్రామ శివారులో ఉన్న దర్గా ఎదుట తవ్వటం మొదలు పెట్టారు. పక్కన వ్యవసాయ తోటలో ఉన్న రైతులు గమనించి గ్రామస్థులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తవ్వకాలకు పాల్పడుతున్న వ్యక్తులను పట్టుకొని దేహశుద్ధి చేశారు. వాహనాన్ని ధ్వంసం చేశారు. తవ్వకాలకు సంబంధించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గ్రామపంచాయతీలో బంధించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు దుండగులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
ఇవీ చూడండి : రికార్డు: 73 ఏళ్ల బామ్మకు కవల పిల్లలు