నిర్మల్‌లో కరోనా లక్షణాలతో ఉన్న వ్యక్తిని వైద్యులు గుర్తించారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లిన నిర్మల్ మండలం ముజ్గికి చెందిన ఓ వ్యక్తి... కొద్దిరోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. జలుబు, తలనొప్పి ఉందంటూ పీహెచ్‌సీ కేంద్రానికి వెళ్లాడు. పరీక్షించిన వైద్యుడు కరోనా వ్యాధి లక్షణాలున్నట్లుగా అనుమానించి వెంటనే నిర్మల్ జిల్లా ప్రభుత్వ ప్రాంతీయాసుపత్రికి తీసుకెళ్లాడు.
వైద్యుల హడావిడి చూసి ఆందోళనకు గురైన సదరు వ్యక్తి.. ఆసుపత్రి నుంచి పారిపోయాడు. వైద్యులు పోలీసులకు బాధితుని పూర్తి సమాచారం అందించారు. ఈలోపు విషయం ఆనోటా ఈనోటా పట్టణమంతా వ్యాపించింది. అప్రమత్తమైన పోలీసులు నగరమంతా గాలించి పారిపోయిన వ్యక్తిని గుర్తించి ఆసుపత్రికి తీసుకొచ్చారు. అనంతరం ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.