కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టే విధంగా చట్టం చేసిందని నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఇటీవల పార్లమెంట్లో వ్యవసాయ బిల్లును ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ... నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక గాజులపేట్లోని మహేశ్వర్ రెడ్డి నివాసం నుంచి గాంధీ పార్కు వరకు ద్విచక్ర వాహనాల ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి వినతిపత్రం అందజేశారు.
వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే మూడు బిల్లులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరకుల, వ్యవసాయోత్పత్తుల వాణిజ్య వ్యాపార ఒప్పందసాగు కాంట్రాక్టు ఫార్మింగ్ చట్టాలు అమల్లోకి వస్తే వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్తుందన్నారు. వ్యవసాయ బిల్లును వెంటనే ఉపసంహరించుకొని లేనట్లయితే దేశవ్యాప్తంగా ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: గాంధీ జయంతి: సత్యాగ్రహ నినాదం.. నిశ్శబ్ద పోరాటం