నిర్మల్ జిల్లాలోని లక్ష్మణచాందా తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ఇప్పటికే 80 శాతం మంది మొక్కజొన్న రైతులు తాము పండించిన పంటలను తక్కువ ధరకు దళారులకు అమ్ముకున్నారని నేతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.1800 చెల్లించి మొక్కజొన్న కొంటామనడం శోచనీయమన్నారు. మక్కలను కొనుగోలు చేస్తామని చెప్పి 5 రోజులకు పైగా గడుస్తున్నా.. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని ఆరోపించారు.
మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు సన్నరకం వరి పండించారని, దోమ పోటుతో ఇప్పుడు ఆ పంటంతా నష్టపోయే పరిస్థితి ఉందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వరి, మొక్కజొన్న పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్, పోశెట్టి, మోహన్ రెడ్డి, గండ్ల చిన్నయ్య, సాయన్న, గంగిరెడ్డి, అజర్లు పాల్గొన్నారు.