తెలంగాణ విమోచన ఉత్సవాలు జరపనందుకు సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో విమోచన ఉత్సవాలు జరపాలని కేసీఆర్ డిమాండ్ చేశారని బండి సంజయ్ గుర్తు చేశారు. నిర్మల్‌లో భాజపా ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ సభ నిర్వహించారు. సభలో కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. సభకు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులకు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.
విమోచన ఉద్యమంలో నిర్మల్ గడ్డపై వెయ్యి మందిని ఉరితీశారు. సర్దార్ పటేల్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు, కేసీఆర్ సీఎం అయ్యేవారు కాదు. విమోచన ఉత్సవాలు జరపనందుకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలంతా కదిలిరావాలి. రాష్ట్రంలో కుటుంబ, గడీల పాలనను బద్ధలు కొడతాం. -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ప్రగతి భవన్‌కు వినిపించాలి
విమోచన వీరుల చరిత్రను భవిష్యత్ తరాలకు తెలిపేందుకే నిర్మల్‌లో సభ నిర్వహించినట్లు బండి సంజయ్ అన్నారు. విమోచన ఉద్యమంలో నిర్మల్ గడ్డపై వెయ్యి మందిని ఉరితీశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచన వీరులు పైనుంచి చూస్తున్నారని పేర్కొన్న ఆయన.. రాష్ట్రంలో కుటుంబ, గడీల పాలనను బద్ధలు కొడతామని స్పష్టం చేశారు. సర్దార్ పటేల్ లేకుంటే తెలంగాణ పాకిస్థాన్‌లో కలిసి ఉండేదని అభిప్రాయపడ్డారు. ఆయనే లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని.. కేసీఆర్ సీఎం అయ్యేవారు కారని వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్‌కు భాజపా జయధ్వానాలు వినిపించాలని పిలుపునిచ్చారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన ఘనత అమిత్ షాకే దక్కుతుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: Revanth Reddy: తెలంగాణకు స్వాతంత్య్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే