Asha workers concern: పారితోషికం మాకొద్దు .. కనీస వేతనం కావాలంటూ నిర్మల్ జిల్లాలో ఆశావర్కర్లు ఆందోళనకు దిగారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీలిస్తున్నాయే తప్ప అమలు పరచడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. నిర్మల్ మండలం కొండాపూర్ గ్రామం నుండి కలెక్టరేట్ వరకు పోరు గర్జన పేరుతో పాదయాత్ర నిర్వహించారు. తమ సమస్యల పరిష్కారంపై ఖచ్చితమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... పాలనాధికారి కార్యాలయం ముందు బైఠాయించారు.
వేధింపులు పెరిగాయి..
ఆశా కార్యకర్తలకు 11వ పీఆర్సీ ప్రకారం పెంచిన వేతనాలు చెల్లించాలని కోరారు. కేంద్రప్రభుత్వం ఇస్తున్న కొవిడ్ ఇన్సెంటివ్ కింద.. వెయ్యి రూపాయలు కేవలం 3 నెలలు మాత్రమే ఇచ్చారని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి అన్నారు. మిగతా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం జేబులో పెట్టుకుందని ఆరోపించారు. జిల్లాలో ఆశా కార్యకర్తలపై అధికారుల వేధింపులు పెరిగాయన్నారు. పనిభారం తగ్గించడంతో పాటుగా తమకు స్మార్ట్ సెల్ఫోన్, ఇంటర్నెట్ బ్యాలెన్స్, చాట్ రిజిస్టర్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇప్పుడు జిల్లా కేంద్రాల్లో చేపట్టిన పాదయాత్ర రేపు హైదరాబాద్లో చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆశావర్కర్ల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.
ఇదీ చదవండి: Good news for drinkers: మద్యం ప్రియులకు శుభవార్త.. అర్ధరాత్రి వరకు అమ్మకాలు