రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం బుధవార్పెట్లోని శివకోటి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మహా సంస్థాన పీఠాధిపతులు జగద్గురు పుష్పగిరి శంకరాచార్యులు విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. ఆలయానికి పెద్ద ఎత్తున మహిళలు మంగళహారతులతో తరలివచ్చారు.
శివాలయానికి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.50 లక్షల నిధులు కేటాయించామని.. ఆలయ అభివృద్ధి పనులకు మరో 15 లక్షలు నిధులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. శివకోటి మందిరం ద్వారా బుధవార్పెట్ చౌరస్తాకు కొత్త శోభ వచ్చిందన్నారు.
శివలింగాన్ని బెనారాస్లో, పీఠాన్ని మహాబలిపురంలో శిల్పులతో ప్రత్యేకంగా తయారు చేయించామని మంత్రి అన్నారు. బంగల్లెట్లోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని రూ.కోటితో త్వరలోనే అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. దేశంలోనే రెండో కోతుల పునరావాస కేంద్రాన్ని నిర్మల్‌లో ఏర్పాటు చేసుకున్నామన్నారు. నిర్మల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. చైన్ గేట్ నుంచి బంగల్పెట్ వరకు రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు.
ఇదీ చూడండి: పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ రబ్బర్ స్టాంప్ : ఆర్. కృష్ణయ్య