Vegetable Crops in Narayanpet : నారాయణపేట జిల్లా మరికల్ మండలం అప్పంపల్లిలో 95శాతం వ్యవసాయ కుటుంబాలే ఉన్నాయి. దాదాపు అందరికీ ఐదెకరాల లోపు చిన్నకమతాలు ఉన్నాయి. అందరి రైతుల్లా వరి, పత్తి, జొన్న లాంటి సంప్రదాయ పంటల్ని మాత్రమే నమ్ముకోలేదు. ఉన్నపొలంలో ఎకరా, అరెకరంలో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. సీజన్‌కు అనుగుణంగా సాగు చేస్తున్నారు. కొత్తిమీర, మెంతికూర, మిరప, టమాట వంటివి క్రమం తప్పుకుండా పండిస్తున్నారు. అంతేకాదు..కూరగాయల్ని స్వయంగా సంతలకు తీసుకుని వెళ్లి విక్రయిస్తున్నారు. మక్తల్, మరికల్, దేవరకద్ర, ధన్వాడ సంతల్లో అమ్ముతున్నారు. సుమారు రోజుకూ వెయ్యి నుంచి 3వేల వరకు సంపాదిస్తారు. ఒక్కో కుటుంబం నెలకు 15 వేల నుంచి 30వేల వరకు ఆదాయం గడిస్తున్నారు.
మహిళలదే ప్రధాన పాత్ర..
Vegetable Cultivation in Narayanpet : కూరగాయల సాగులో లాభాలున్నాయి కదా అని నాలుగైదు ఎకరాల్లో సాగు చేయట్లేదు. ఎకరా, అరెకరాల్లో మాత్రమే పండిస్తారు. ఇందుకు కారణం అవసరమైన నీటి లభ్యత లేకపోవడం. రేటు ఉందని ఒకే పంటను పండించరు. ధర ఉన్నా లేకపోయినా ఆ సీజన్ లో పండే ఐదారు రకాల కూరగాయలు, ఆకుకూరల్ని వేస్తారు. పెట్టుబడి పెద్దగా ఉండదు కాబట్టి ధర లేకపోయనా నష్టం ఉండదని రైతులు వెల్లడించారు. మిగిలిన పంటల్లా ఆదాయం కోసం 3, 4 నెలలు ఆగాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇందులో ప్రధాన పాత్ర మహిళలు పోషిస్తున్నారు. ఇంటి పనులు చూసుకుంటూనే కూరగాయలు తెంపి స్వయంగా వెళ్లి అమ్ముకుని వస్తున్నారు.
మా బతుకులు మారాయి..
"మాకున్న భూమిలో సగం వరి సాగు చేస్తున్నాం. మిగతా సగం కూరగాయలు పండిస్తున్నాం. మేమే సాగు చేస్తున్నాం. మేమే కూరగాయలు తెంపి.. విక్రయిస్తాం. కూరగాయల సాగుకు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కానీ ఎంత కష్టపడితే.. అంత లాభాలు వస్తాయి. కూరగాయల సాగుతో మా జీవితాలు మారిపోయాయి. గుడిసెల్లో ఉండే మేము.. ఇళ్లు కట్టుకున్నాము. మా పిల్లలను మంచిగా చదివిస్తున్నాం. "
- మహిళా రైతులు
అందుకే కూరగాయల సాగు..
"కూరగాయలకు మార్కెటింగ్ అవకాశం ఎక్కువగా ఉంది. మేం కూరగాయల సాగు వైపే ఆసక్తి ఎందుకు చూపిస్తున్నామంటే.. మా గ్రామానికి మార్కెట్ చాలా దగ్గరగా ఉంది. ఒకరోజు కూరగాయలు తీసుకుని మార్కెట్‌కు వెళ్తే రూ.2 నుంచి రూ.3వేల రూపాయలు వస్తున్నాయి. ఎప్పటి నగదు అప్పుడే రావడం వల్ల మేం కూరగాయల సాగుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాం."
- రైతులు
కూరగాయలతో కుబేరులు..
Vegetable Cultivation in Telangana : అప్పంపల్లి అంటే ఒకప్పుడు సాధారణ పల్లె. ఇప్పడు చూద్దామన్న ఆ గ్రామంలో ఒక్క గుడిసె కనిపించదు. కూరగాయల ఆదాయంతోనే అక్కడి ప్రజలు పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. పిల్లల్ని మంచి చదువులు చదివించారు. ఆలా చదివిన విద్యార్ధులు ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. హోంగార్డు నుంచి గ్రూప్-1 వరకు, వ్యవసాయం నుంచి అంతరిక్ష సంస్థ ఐస్రో వరకూ విద్య, వ్యాపారం, రాజకీయం సహా అనేక రంగాల్లో యువకులు రాణిస్తున్నారు. ఐనా..ఆ కుటుంబాలు వ్యవసాయం, కూరగాయల సాగుని తమ వృత్తిగా కొనసాగిస్తూనే ఉన్నాయి.
అప్పంపల్లి అన్నదాతలు ఆదర్శం..
Vegetable Crops in Telangana : ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లకుండా.. పంట మార్పిడి చేయకుండా.. సంప్రదాయ పంటల్ని మాత్రమే పండించి నష్టపోతున్న రైతులకు అప్పంపల్లి గ్రామ రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు.