నారాయణపేట జిల్లా కృష్ణా మండలం వాసునగర్ కర్ణాటక సరిహద్దులో కృష్ణానదిలో దిగి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పాలకొల్లుకు చెందిన రామకృష్ణరాజు, శ్రీహరి రాజు బంధువుల ఇంట్లో వివాహానికి హాజరయ్యారు. ఇవాళ సరదాగా కృష్ణానదిలో స్నానానికి మరో ముగ్గురు బాలికలతో కలిసి వెళ్లారు. బంధువులు వెళ్లిపోయినా ఐదుగురు మాత్రం నదిలో స్నానాలు చేస్తూ గడిపారు.
అందులో ఓ అమ్మాయి కాలు జారి పడిపోగా.. ఆమెను రక్షించేందుకు నలుగురూ నదిలోకి వెళ్లారు. పక్కనే ఉన్న జాలరి గోపాల్ ముగ్గురు అమ్మాయిలను రక్షించగా... ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఎంత వెతికినా వారి ఆచూకీ దొరకలేదు. కృష్ణా మండల కేంద్రం నుంచి గజఈతగాళ్లను రప్పించారు. నదిలో విస్తృతంగా గాలించగా... ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వాటిని పోస్టుమార్టం కోసం మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వాళ్లలో శ్రీహరి రాజుకు ఈత వచ్చినా... నీళ్లలో మునిగిచనిపోవడం అందరినీ కలిచివేసింది.
ఇవీ చూడండి: రామయ్య సన్నిధిలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు