నారాయణపేట మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని అధికారుల పనితీరుపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది రైతులు రైతుబంధు పథకానికి నోచుకోవటం లేదని, భగీరథ పైపులైన్ పనులు పూర్తిస్థాయిలో చేపట్టలేదని సర్పంచ్ రామ్మోహన్ తెలిపారు. కోటకొండలో విద్యుత్ సమస్య పరిష్కరించాలని చెబితే లైన్మెన్ రూ.7వేలు అడిగినట్లు సర్పంచ్ విజయలక్ష్మి ఆరోపించారు.
గ్రామాల్లో శ్మశానవాటిక, డంపింగ్ యార్డుల నిర్మాణాలకు కేటాయించిన ప్రభుత్వ, భూముల విషయంలో రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నట్లు సభ్యులు తెలపగా సర్వేచేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. సభ్యులు ప్రస్తావించిన సమస్యలు, పరిష్కారానికి సంబంధించి వారం రోజుల్లో అధికారులు నివేదిక ఇవ్వాలని ఎంపీపీ సూచించారు.