నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ట్రాక్టర్ ఇసుక ధర 3 వేల రూపాయల నుంచి 4 వేలు పలుకుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో రెండున్నర వేల నుంచి 3 వేలు ఉంది. ధర అధికంగా ఉండటం, ఇసుక అందుబాటులో లేకపోవడం వల్ల మరుగుదొడ్ల నిర్మాణాలు నిలిచిపోయాయని భావించిన ప్రభుత్వం ఉచితంగా ఇసుక తెచ్చుకునేందుకు అనుమతించారు. ఇదే అదునుగా చేసుకొని అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఎస్బీఎం అనుమతులు పొంది వందల సంఖ్యలో ట్రాక్టర్ల ఇసుకను పక్కదారి పట్టిస్తూ... ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు.
స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం కోసం పంచాయతీ రాజ్ , రెవెన్యూ శాఖ అధికారులు ఉచితంగా అనుమతిస్తున్నారు. అనుమతులు పొందిన వారు ట్రాక్టరు రవాణా ఖర్చులను మాత్రమే తీసుకోవాలి. రెండు మరుగుదొడ్లకు గాను ఒక ట్రాక్టర్ ఇసుక అనుమతి ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ... క్షేత్రస్థాయిలో ఇది అమలు కావట్లేదు.
ఇసుక తరలింపునకు అనుమతులు పొందిన ట్రాక్టర్ల నెంబర్లు, తరలిస్తున్న ట్రాక్టర్ల నెంబర్లు వేర్వేరుగా ఉంటున్నాయి. కొన్ని సార్లు నెంబర్ ప్లేట్లు లేని ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మక్తల్ తహసీల్దార్ శ్రీనివాస్ దీనిపై స్పందిస్తూ... ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారమివ్వాలని కోరారు.
ఇవీ చూడండి: ఇంటి పైకప్పు కూలి బాలుడు మృతి