Health Consciousness Growing in Urban Areas : పట్టణ వాసుల్లో ఆహార అలవాట్లు క్రమక్రమంగా మారుతున్నాయి. గుడ్ హెల్త్ కోసం పాత పద్ధతులను అనుసరిస్తున్నారు. మార్నింగ్ చిరు ధాన్యాలతో చేసే జావలు, పచ్చి కూరగాయ జ్యూస్‌లు, సాయంత్రం జొన్న, రాగి, గోధుమ రొట్టెలు, సలాడ్‌లు తీసుకుంటున్నారు. రోజురోజుకూ ప్రజల్లో ఈ రకమైన ఫుడ్ హేబిట్స్ పెరగడంతో పట్టణాల్లోనూ విక్రయ కేంద్రాలు విరివిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఉదయం నడక, వ్యాయామం చేసేవారు, కాలేజీలు, పాఠశాలలకు వెళ్లే యువకులు, చిన్నారులు అన్ని వర్గాల వారిని ఇవి బాగా ఆకర్షిస్తున్నాయి.
జీవనశైలిలో మార్పు :
✸ నేటి ఉరుకులు పరుగుల జీవితంలో వ్యాధుల ముప్పు పెరుగుతోంది. అసంక్రమిక వ్యాధుల్లో రక్తపోటు, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏటా పది శాతం పెరుగుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీర్ఘకాలం ఉండే ఈ వ్యాధులను అదుపులో ఉంచుకోవాలంటే లైఫ్స్టైల్లో ఈ మార్పు తప్పనిసరి. దీనికి శారీరక శ్రమతో పాటు ఆహారపు అలవాట్లు సైతం ప్రధానం.
✸ ఉదయం టిఫిన్ స్థానంలో రాగి, జొన్న జావ, క్యారెట్, బీట్‌రూట్, బూడిద గుమ్మడి, సోరకాయ, కాకరకాయలు వంటి కాయగూరలతో తయారు చేసిన జ్యూస్‌లతో మొలకెత్తిన తృణధాన్యాలు తీసుకుంటున్నారు. అధిక బరువు, సుగర్, బీపీతో బాధపడే వారు రాత్రివేళల్లో జొన్న, గోధుమ రొట్టెలు తీసుకుంటున్నారు. వీటిని ఎక్కువగా 40 సంవత్సరాల పైబడిన వారి నుంచి వీటి వినియోగం బాగా పెరిగింది.
✸ సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో వీటి సేల్స్ సెంటర్లు కూడా విరివిగా అందుబాటులోకి వస్తున్నాయి. సిరిసిల్ల పట్టణంలోని మార్కెట్, గాంధీ కూడలి, కోర్టు సముదాయం, పాత బస్టాండ్ సమీపంలో జావ అమ్మే సెంటర్లు వెలిశాయి. ఒక్కోచోట నిత్యం వంద నుంచి రెండు వందల మంది జావ తాగుతున్నట్లు షాపు నిర్వాహకులు తెలుపుతున్నారు. ఇక సాయంత్రం పూట జొన్న, గోధుమ రొట్టెల కేంద్రాలు సిరిసిల్ల పట్టణంలో వీధికొకటి ఉన్నాయి.
సిరిసిల్ల పట్టణం శివనగర్‌కు చెందిన రాకేశ్ రూ.5 లక్షల ఖర్చుతో జొన్న, గోధుమ రొట్టెలు తయారు చేసే మెషిన్లను తీసుకొచ్చారు. వీరికి పట్టణంలో రెండు చోట్ల సేల్ సెంటర్లు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో రోజుకు వెయ్యికిపైనే అమ్ముతుంటారు. శుభకార్యాలకు ఆర్డర్లపై చేసి బయటకు ఇస్తుంటారు.
సుభాష్‌నగర్‌కు చెందిన మేరుగు సత్యనారాయణ తన ఇంట్లోనే ఉదయం బూడిద గుమ్మడికాయ, సోరకాయ, కాకరకాయ జ్యూస్‌లు, సాయంత్రం టైంలో క్యారెట్, దోస, బీట్‌రూట్, అరటిపండ్లతో తయారు చేసిన సలాడ్‌లు తయారు చేసి ఇస్తుంటారు. దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచుకోవడంతో పాటు శరీరంలోని మలినాలను శుభ్రం చేసేందుకు జ్యూస్‌లు దోహదపడతాయని ఆయన చెబుతున్నారు.
పద్మనగర్‌కు చెందిన పొరండ్ల కళావతి ఎనిమిది సంవత్సరాల నుంచి జొన్నరొట్టెలు తయారు చేసి అమ్ముతున్నారు. ఈమెతో పాటు మరో ముగ్గురు సైతం అక్కడ ఉపాధి పొందుతున్నారు. నేత కార్మికులు, వయసు పైబడిన వారు ఎక్కువగా జొన్నరొట్టెలు తీసుకెళ్తుంటారని ఆమె వివరిస్తున్నారు.
ఆరోగ్య సిరులు ప్రసాదించే 'చిరు ధాన్యాలు' - ఏది తింటే ఎంత శక్తి వస్తుందో తెలుసా?
రోజుకు 5 నిమిషాల పరుగుతో అన్ని ఆరోగ్య సమస్యలకు చెక్! - హాస్పిటల్ వైపు కూడా చూడరు!!