నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాద్వార్ గ్రామానికి చెందిన బసిరెడ్డి ఉద్యోగం నుంచి విరమణ పొందారు. అనంతరం వ్యవసాయ మీదున్న మక్కువతో తనకున్న పొలంలో సేంద్రియ వ్యవసాయం చేస్తూ.. తోటి రైతులను కూడా ఆదిశగా ముందుకు నడిపిస్తున్నారు. ఖరీదైన పండ్ల జాబితాలో చేరిన జామ పంటను సేంద్రియ పద్ధతిలో పండిస్తూ లాభాలు గడిస్తున్నారు. దేశీయ, తైవాన్, తెల్లజామ వంటి రకాలను కడియం నుండి ఒక్కో రకం 100 మొక్కల చొప్పున 3 ఎకరాల్లో సాగు చేస్తూ లాభాలను అర్జిస్తున్నారు. మొక్కలు నాటిన మూడో సంవత్సరం నుండి పంట చేతికి రావడం వల్ల మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటున్నది. జామతో పాటు, అరటి మొక్కలు 100 ,కొబ్బరి మొక్కలు 100 నాటి.. సేంద్రియ ఎరువులు వేస్తూ వాటిని పెంచుతున్నారు. ప్రస్తుతం జామ, అరటి పంటలు చేతికి వచ్చాయి. మక్తల్ పట్టణంలోనే కాకుండా పరిసర ప్రాంతాలలో మార్కెటింగ్ చేసి లాభాలను పొందుతున్నట్లు బసిరెడ్డిని అనుసరిస్తున్న రైతులు తెలిపారు.
సేంద్రీయ ఎరువులతో పంటలు సాగు చేస్తున్నందున పరిసర ప్రాంతాల ప్రజలు కూడా పండ్లు కొనడానికి ఆసక్తి చూపుతున్నారని రైతు బసిరెడ్డి తెలిపారు. సాగు చివరివరకు ఎలాంటి నీటి సమస్యలు తలెత్తకుండా పొలంలో నీటి కుంటలు ఏర్పాటు చేశారు. దీంతో నీటిని డ్రిప్ పద్ధతి ద్వారా పొదుపుగా వాడుతూ సాగు చేశారు. దిగుబడి నాణ్యతలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రసాయన ఎరువులు వినియోగించకుండా వేస్ట్ డీకంపోజ్ వాడడం వల్ల కాయలు పెద్దగా, రుచిగా వస్తున్నాయని ఆయన తెలిపారు. సంప్రదాయ పంటలకు భిన్నంగా సాగు చేస్తూ.. ఉపాధితో పాటు.. ఆదాయం పెంచుకుంటూ… సంప్రదాయ రైతులకు జామ సాగు మేలైన ఆదాయ వనరు అని నిరూపించారు.