నారాయణపేట జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన తెలిపారు. ఉట్కూరు చెరువు నిండి ప్రవహిస్తుండగా... మక్తల్-నారాయణపేట రోడ్డు మార్గాన్ని, మాగనూరులో పలు ప్రాంతాలను ఎస్పీ పరిశీలించి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో ఉన్న చెరువులు, కుంటల నీటి ప్రవాహం గురించి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుని ప్రత్యక్షంగా వెళ్లి పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో కలిసి రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... చేపల వేటకు వెళ్లరాదని సూచించారు. అలాగే పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. మక్తల్-నారాయణపేట రోడ్డు మార్గంలో వెళ్తున్న నీటి ప్రవాహాన్ని పరిశీలించి ప్రజలు అటు ఇటు పోకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టాలన్నారు. వరదల వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా డయల్ 100కి కాల్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని ఎస్పీ చేతన తెలిపారు.
ఇవీ చూడండి: లైవ్ వీడియో: చూస్తుండగానే వాగులో కొట్టుకుపోయాడు...