ఓటు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని నారాయణ పేట జిల్లా కలెక్టర్ డి.హరిచందన తెలిపారు. ప్రతీ ఒక్కరు తమ ఓటును నిర్భయంగా వినియోగించుకుని ప్రజాస్వామ్య బలోపేతానికి సహకరించాలని కోరారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ నుంచి నారాయణపేట ప్రభుత్వ పాఠశాల వరకు సాగిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ప్రలోభాలకు లొంగకుండా..
18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. విధిగా ఓటును వినియోగించుకుని మంచి నాయకుల్ని ఎన్నుకుంటే.. తద్వారా దేశాభివృద్ధికి దోహదపడవచ్చని తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటును వినియోగించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న సీనియర్ సిటిజన్స్‌కు సన్మానం చేశారు. ఓటు ప్రాముఖ్యత అంశంపై జిల్లా స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో గెలుపొందిన విజేతలకు ఆమె బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్, జిల్లా అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే: సుప్రీం