నారాయణపేట జిల్లా మక్తల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఆస్తుల నమోదు సర్వేను పాలనాధికారి హరిచందన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పట్టణంలోని పలు వార్డుల్లో సర్వే చేపడుతున్న అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు. ఉదయం ఆరు గంటలకే కేటాయించిన వార్డులకు చేరుకుని వివరాలు సేకరించాలని తెలిపారు. ఇంటి యజమానుల ఆధార్ సంఖ్య, ఇంటి విస్తరణ వివరాలను పకడ్బందీగా యాప్లో నమోదు చేయాలన్నారు.
సర్వేలో ఏమైనా ఇబ్బందులు వస్తే ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. రోజుకు కచ్చితంగా 100 నుంచి 150 ఇండ్ల వివరాల సేకరణ పూర్తి చేయాలన్నారు. మక్తల్ మండలంలోని మద్వర్లో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, పురపాలక కమిషనర్, తహాసీల్దార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.