నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ రైతులు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై.. ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మక్తల్ పుర వీధుల గుండా మార్కెట్ యార్డు వరకు సాగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
![minister srinivas goud started tractor rally at makthal in narayanpet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9047856_nl2.png)
గత ప్రభుత్వాల హయాంలో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని మంత్రి ఆరోపించారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు నీటి కష్టాలు తప్పాయన్నారు. రైతులకు ఉచితంగా కరెంటు అందజేస్తున్నామని తెలిపారు. రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తుందని గుర్తు చేశారు.
భూ తగాదాల పరిష్కారం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారని మంత్రి పేర్కొన్నారు. ఈ చట్టం రైతులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ నిజాం పాషా, దేవరి మల్లప్ప, రాజేష్ గౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: నేరాలను అరికట్టేందుకు మంచి పోలీస్ వ్యవస్థ: కిషన్‌రెడ్డి