నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సంగం బండ రిజర్వాయర్ ఎడమ కాలువ ద్వారా మంత్రి శ్రీనివాస్ గౌడ్ నీటిని విడుదల చేశారు. అనంతరం మక్తల్ పట్టణ పరిధిలో ఏర్పాటు చేసే మియావాకి పార్క్ కు స్థలం పరిశీలించారు. ఈ రిజర్వాయర్ ద్వారా లక్షా 85 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి అన్నారు. పాలమూరు-రంగారెడ్డి కూడా పూర్తి అయితే... ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సశ్యశ్యామలం అవుతుందన్నారు. గతంలో కరువుతో అలమటించిన ప్రాంతం నేడు సుభిక్షంగా ఉందన్నారు.
కరోనా విపత్తులోనూ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రాజెక్టుల ద్వారా ఎన్నో కులవృత్తులు ఉపాధి పొందుతున్నాయని అన్నారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. గ్రామంలో దారి పొడవునా మొక్కలు నాటించాలని సర్పంచ్లకు, అధికారులకు సూచించారు. భీమ పంప్ హౌస్ కోసం ప్రభుత్వం సేకరించిన స్థలంలో సుందరమైన పార్కు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కలెక్టర్ హరిచందన, ఎస్పీ చేతన, ఆర్డీవో శ్రీనివాసులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండిః కొవిడ్ బాధితులకు పరీక్షల నుంచి చికిత్సల వరకు అడ్డంకులే