అప్పటి వరకు ఆ గ్రామమంతా ప్రశాంతంగా ఉంది. రోజూ మాదిరిగానే ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. కొందరేమో రాత్రి భోజనాలు కానిచ్చేసి.. తాపీగా ఆరుబయట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. మరికొందరేమో చలి మంటలు వేసుకుంటున్నారు. ఇంతలోనే గ్రామంలో ఓ బాలిక అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిందనే వార్త తెలిసింది. సరేలే.. ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని లైట్ తీసుకున్నారు. కాసేపటికే వాంతులు, విరేచనాలతో మరో 14 మంది అస్వస్థతకు గురి కావడంతో గ్రామస్థులంతా అప్రమత్తమయ్యారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ఆసుపత్రిలో చేరిన బాలిక చనిపోయిందనే విషయం తెలిసింది. దాంతో గ్రామస్థుల్లో ఆందోళన మొదలైంది. వెంటనే అస్వస్థతకు గురైన బాధితులందరినీ ఆసుపత్రులకు తరలించారు. వివరాల్లోకి వెళితే..
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం మొమినాపూర్‌లో 15 మంది గ్రామస్థులు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. సోమవారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధితులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో అనిత అనే ఓ 16 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోగా.. ఇతర బాధితులను కుటుంబసభ్యులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అప్పటి వరకు బాగానే ఉన్న తమ వారు.. ఉన్నట్టుండి అస్వస్థతకు గురికావడం వెనకున్న కారణాలు తెలియడం లేదని గ్రామస్థులు తెలిపారు.
విషయం తెలుసుకున్న అధికారులు ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. అనంతరం గ్రామంలోని ఇంటింటికీ తిరిగి పరిస్థితిపై ఆరా తీశారు. ఒక్కసారిగా 15 మంది గ్రామస్థులు అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.
ఇవీ చూడండి..
సర్కార్ వద్దకు 'పురపాలికల్లో అవిశ్వాసం'.. నెక్ట్స్ ఏం జరగనుందో..?
పెళ్లితో ఒక్కటవ్వాల్సిన ప్రేమ జంట.. క్షణికావేశంతో మృత్యుఒడికి